28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అవతరించిన అర్జెంటీనా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఆ జట్టు టైటిల్ గెలిచాక తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ప్రతిష్టాత్మక టైటిల్‌ను దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సహా కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా ఆకాంక్షించాడని, అతని కలను నా సారధ్యంలోని అర్జెంటీనా జట్టు సాకారారం చేయడం నా అదృష్టమని మెస్సీ పేర్కొన్నాడు.
మారడోనా భౌతికంగా తమ మధ్య లేకపోయినా, అతని ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూ ఉండిందని తెలిపాడు. మరోవైపు అభిమానులు విజయోత్సవాలను జరుపుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విజయంతో లభించిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చాడు. తన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు, ముఖ్యంగా తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు.
ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మెస్సీ.. జట్టు విజయాన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు, అలాగే గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు తెలిపిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు.