అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన అనూహ్య నిర్ణయంతో ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లీగ్ క్వార్టర్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని బార్సీలోనా జట్టు 2-8తో బేర్న్ మునిచ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది మెస్సీ కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాజయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా 2007-08 సీజన్ నుంచి టైటిల్స్ గెలుస్తున్న ఆ జట్టుకు ఇది ఘోరపరాభావం. బార్సిలోనా క్లబ్‌కు మెస్సీ పంపిన పత్రం సీజన్ ముగింపులో క్లబ్ వీడొచ్చనే నిబంధనను పేర్కొన్నాడు.
అయితే ఆ రూల్ గడువు జూన్‌లోనే ముగిసిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని క్లబ్ ప్రకటించింది. బార్సిలోనా క్లబ్‌కు చెందిన మాసియా యూత్ అకాడమీలో 2001లో చెరిన మెస్సీ.. 2003లో 16 ఏళ్ల వయసులో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. లియోనల్ మెస్సీ.. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు