మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిసిల్లా ఛాన్ మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి లోతైన శాస్త్రీయ పరిశోధనలకోసం తమ స్వచ్ఛంద సంస్థ చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ద్వారా రెండున్నర లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత రూ.25 వేల కోట్ల విరా ళాలు ఇస్తామని పేర్కొన్నారు.
రానున్న పదేళ్లలో వైద్యరంగంలో నూతన పరిశోధనలు, కృత్రిమ మేథ మీద పనిచేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో నెలకొల్పుతున్న విద్యాసంస్థ కోసం మొదట రూ.3 వేల770 కోట్లు అందజేస్తామని, మరో పదిహేనేళ్లపాటు సంస్థకు నిధులు అందుతాయని సీజెడ్‌ఐ ప్రతినిధి జెఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. ఆ సంస్థకు జుకర్‌బర్గ్ తల్లి కరేన్ కెంప్నెర్ జుకర్‌బర్గ్ పేరు పెట్టనున్నారు.
ఇక రూ.4,500కోట్ల నుంచి రూ.6.7వేల కోట్ల వరకు సీజెడ్‌ఐలోని బయోమెడికల్ ఇమేజింగ్ ఇనిస్టిట్యూట్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక మరో వంద కోట్ల రూపాయలను చాన్ జుకర్‌బర్గ్ బయోహబ్ నెట్‌వర్క్‌కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.