ఫేస్బుక్ మాతృ సంస్థ పేరును మార్క్ జుకమ్‌బర్గ్ ‘మెటా’ గా మార్చిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఫేస్‌బుక్‌పై భారీ ఎత్తున ఆరోపణలు రావడంతో..ఫేస్బుక్ పేరును మారిస్తే కాస్త ఊరట లభించవచ్చునని మార్క్ జుకమ్‌బర్గ్ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘మెటావర్స్’ అనే వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాం కోసం కూడా ఫేస్బుక్ పేరును మార్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ఫేస్బుక్ పేరు మార్చిన విషయం గురించి పక్కన పెడితే మార్క్ జుకమ్‌బర్గ్ పెద్ద ఐడియాతోనే ముందుకు వస్తోన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌లో పేరొందిన యాపిల్‌ను ఢీ కొట్టే ప్రయత్నాలకు జుకమ్‌బర్గ్ సిద్ధమయ్యాడు. మెటా సంస్థ త్వరలోనే యాపిల్‌కు పోటీగా స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది.
మెటా తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను వచ్చే ఏడాది నాటికి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్‌కు ఉపయోగించేందుకు వీలుగా స్మార్ట్‌వాచ్‌కు కెమెరాను కూడా అమర్చారు. కాగా మెటా ఇప్పటికే రేబాన్ సహాకారంతో స్మార్ట్గ్లాసెస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీలకు మెటా పోటీగా నిలిచే అవకాశం లేకపోలేదని పలు టెక్నికల్ నిపుణుల భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా..మెటా మరికొద్ది రోజుల్లోనే మెటావర్స్ వర్చువల్ రియాల్టీ ప్రోగ్రాంను కూడా లాంచ్ చేయనుంది. అందులో భాగంగా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు, పోర్టల్ వీడియో-చాట్ పరికరాలను మెటా ఇప్పటికే విక్రయిస్తోన్నట్లు తెలుస్తోంది. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీని మిళితం చేసే “ప్రాజెక్ట్ కాంబ్రియా” అనే కోడ్‌నేమ్‌తో కూడిన కొత్త హై-ఎండ్ హెడ్‌సెట్‌పై పనిచేస్తున్నట్లు మెటా గురువారం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ రూపొందించిన స్మార్ట్‌వాచ్ దాని హెడ్సెట్లకు ఇన్పుట్ పరికరం లేదా అనుబంధంగా పని చేస్తుందని మెటా తెలిపింది.