అనుకున్నట్లుగానే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా శుక్రవారం రోజున అవతరించింది. యాపిల్‌ను వెనక్కినెట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో నెంబర్ 1 స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సాధించింది. మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ విలువ 2.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ 2.489 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.476 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ రికార్డును క్రియోట్ చేసింది. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ సంబంధింత సేవలు కరోనా సమయంలో బాగా కలిసి వచ్చాయి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో మైక్రోసాఫ్ట్ స్టాక్ 1 శాతం పెరిగి, 327.50 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో యాపిల్ షేర్ విలువ సుమారు 4 శాతం మేర పడిపోయి, 146.41 డాలర్లకు చేరుకుంది. యాపిల్‌ను సెమీ కండక్టర్ల కొరత, సప్లై చైన్ రంగాలు దెబ్బతీశాయి.
భారత సంతతికి చెందిన సత్యనాదెల్లా రాకతో మైక్రోసాఫ్ట్ రయ్రయ్ మంటూ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మార్కెట్ క్యాప్ విషయంలో మైక్రోసాఫ్ట్ నెంబర్ 1 స్థానం సాధించడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. 2014 ఫిబ్రవరి 4 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో నియామకం జరిగినప్పటినుంచి సత్యనాదెల్లా కంపెనీలో పలు కీలక మార్పులను, ఇతర కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
నోకియా హ్యండ్‌సెట్ వ్యాపారంలో భాగంగా సుమారు 7 బిలియన్ డాలర్ల కొనుగోలును రద్దుచేశారు. ఈ మొత్తాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వ్యాపారాల్లో భారీ మొత్తంలో ఇన్సెస్ట్ చేసేలా నిర్ణయాలను తీసుకున్నారు. అంతేకాకుండా లింక్డ్ ఇన్, న్యూయాన్స్, గిట్‌హబ్ వంటి కంపెనీలను సముపార్జన చేయడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. ఒక విధంగా సత్య నాదెల్లా తన కఠిన నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్‌ను పూర్తిగా పునర్నిర్మించారు.
తాజాగా యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ తగ్గిపోవడం కొద్ది రోజులపాటే ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ తిరిగి ప్రపంచం నెంబర్ 1 మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వచ్చే మూడు సంవత్సరాల్లో యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ మూడు ట్రిలియన్స్ కల్గి ఉన్న కంపెనీ అవతరించే అవకాశం ఉందని ఇంటరాక్టివ్ ఇన్వెస్టర్ నిపుణులు విక్టోరియా స్కాలర్ ఆశాభావం వ్యక్తం చేశారు.