హైదరాబాద్ లో అర్ధరాత్రి హత్యలు

హైదరాబాద్ లో అర్ధరాత్రి హత్యలు

రెండు వారాల కిందట హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి జరిగిన హత్యలు కలకలం రేపాయి. రోడ్ల వెంబడి యాచన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒకేరోజు హబీబ్ నగర్, నాంపల్లి ఏరియాల్లో జరిగిన ఈ హత్యలు స్థానికంగా అలజడి రేపాయి. బిచ్చగాళ్లను ఎవరు చంపి ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన హబీబ్ నగర్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. ఓ సైకో కిల్లర్ ఈ దారుణాలకు పాల్పడినట్లు తేల్చారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.

గత నెల 15 తేదీన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యాచకుడు దారుణ హత్యకు గురయ్యాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నాంపల్లిలోనూ మరొకరిని కిరాతకంగా హతమార్చారు. ఈ రెండు ఘటనలు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే జరిగాయని చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. మద్యం మత్తులో సైకో కిల్లర్ ఈ హత్యలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన సైకో కిల్లర్ ఖదీర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు ఖదీర్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. గతంలోనూ పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు. గతంలో ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవించాడని.. బయటికి వచ్చిన తర్వాత హబీబ్ నగర్, నాంపల్లిలో మరో రెండు హత్యలు చేసినట్లు చెప్పారు. మద్యం మత్తులో బిచ్చగాళ్లను చంపేసినట్లు తెలిపారు.