ఒక గజ్వేల్ నుంచే పోటీ చేయ్…అంటూ బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లోని చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ యువత ఆత్మీయ సమ్మేళన వేదికగా బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. ఈటలకు దమ్ముంటే ఒక గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని, అలా కాకుండా హుజురాబాద్ లోనూ పోటీ చేస్తానంటున్నారు అంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్లేనని ఎద్దేవా చేశారు.
బిజెపికి ఈ ఎన్నికల్లో గుండు సున్నా వస్తుందని భయంతో ఈటల రెండు చోట్ల బరిలో ఉంటానంటున్నారని గంగుల అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కెసిఆర్ రావాలని కోరారు. కాంగ్రెస్ బిజెపి పాలకులు ఆంధ్రాలో కలుపుతారని.. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇవ్వండని వెల్లడించారు. డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కెసిఆర్, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల ఉండాలని స్పష్టం చేశారు. పదమూడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ జెండా ఎగురుతుంది..కెసిఆర్ లేని తెలంగాణ ని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు. కెసిఆర్ లేని తెలంగాణ ఆంటే నెర్రలు వారిన తెలంగాణనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.