క్షీణించిన మంత్రి ఆరోగ్యం

క్షీణించిన మంత్రి ఆరోగ్యం

వ్యవసాయ మంత్రి దురైకన్ను(72) ఆరోగ్యం క్షీణించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు తీవ్రచికిత్స అందిస్తున్నారు. సీఎం పళనిస్వామి, మంత్రులు సోమవారం పరామర్శించారు. దురైకన్ను ఈ నెల 13న కారులో సేలంకు వెళుతుండగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు. క్రమంగా పల్స్‌ తగ్గడంతో హుటాహుటిన చెన్నైకు తరలించారు.

ప్రైవేటు ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. సీఎం పళనిస్వామి, మంత్రులు జయకుమార్, విజయభాస్కర్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం వేర్వేరుగా ఆస్పత్రికి వెళ్లి దురైకన్నును పరామర్శించారు. వైద్య బృందాలతో సీఎం పళనిస్వామి మాట్లాడారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఎక్మో చికిత్స అందిస్తున్నామని.. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.