మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం-ఎస్ఈఆర్పీ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 80 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషాదయాకర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు.. చదవు పూర్తి చేసుకొని… అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అందిపుచ్చుకున్న అవకాశాలతో భవిష్యత్ కార్యాచరణను యువత రూపొందించుకోవాలన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా, నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం శిక్షణ కూడా ఇప్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జియో, రిలయెన్స్, డా.రెడ్డీస్, హెటరో ఫార్మా, కార్వీ లాంటి 80కి పైగా కంపెనీలు, 40కి పైగా ఉచిత శిక్షణ కల్పించే ట్రైనింగ్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.