మహానేతతో కలిసి పని చేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం.. ఆమె మీడియాతో మాట్లాడారు.
కడప నేను పుట్టిన ఊరు. టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్సార్ నన్ను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేయాలని కలగన్నా. ఆయన అకాలమరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డా. ఆ టైంలో ఐరన్ లెగ్ అంటూ నన్ను టీడీపీ వాళ్లు అవహేళన చేశారు. వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.
ఆ దివంగత మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయనూ సందర్శించా.ఎమ్మెల్యే కావాలన్నది తన కల అని, ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు.
గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు.. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని భగవంతుడ్ని వేడుకున్నానని, ఆ కోరిక నెరవేర్చినందుకు కళ్యాణోత్సవానికి హజరయ్యానని ఆమె చెప్పారు. ఇకపై జబర్దస్త్ చేయరా అని చాలా మంది అడుతున్నారని, కానీ.. పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్న మంత్రి రోజా.. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు.