అక్క ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కూతురును తల్లిదండ్రులు నిలదీయడం.. అనంతరం జరిగిన గొడవతో అవమానం భరించలేక చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సీమాఫర్హీన్ తెలిపిన వివరాల ప్రకారం… నెక్కొండ రజక వాడకు చెందిన అమృత మండల కేంద్రానికి చెందిన జహీర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలోపడింది. ఈనెల 5న చెల్లెలు అంజలితో కలిసి జహీర్ ఇంటికి వెళ్లి ప్రేమ, పెళ్లి విషయమై అతడిని నిలదీశారు.
జహీర్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు వారిని దుర్భాషలాడి, అవమానించి వెళ్లగొట్టారు. దీంతో అవమాన భారంతో ఇంటికి వచ్చిన బాలికలను తల్లిదండ్రులు సైతం నిలదీశారు. శనివారం రాత్రి ఇది కాస్త గొడవకు దారి తీయడంతో అంజలి బహిర్భూమికి వెళ్తానంటూ బయటకు వచ్చి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు.
బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు నర్సంపేట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునబాలిక మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలి తండ్రి రామానుజం ఫిర్యాదు మేరకు అక్క ప్రియుడు జహీర్‌తోపాటు అతడి తండ్రి జమాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.