మైనర్‌ ప్రేమజంట ఆత్మహత్య

మైనర్‌ ప్రేమజంట ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్రేమ జంట వారి కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కనుకులలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఇద్దరు ప్రేమికులను మందలించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారి కులాలు వేరు కావడం, ఇద్దరు ప్రేమికులు మైనర్లు కావడంతో పెండ్లి చేయలేమని తేల్చి చెప్పారు.

దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట చావే మార్గమని నిశ్చయించుకొని నిన్న ప్రియుడు శివ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ కరీంనగర్ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. ప్రియుని మరణవార్త తెలుసుకుని మనస్తాపం చెందిన ప్రియురాలు సుస్మిత నేడు తెల్లవారుజామున గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు తెలిసింది. మృతి చెందిన ప్రేమికుల ఫైల్ ఫోటోలతో వీడియో తయారు చేసి గ్రామస్తులు సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశారు.