టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచిన కోట్లాది భారతీయుల మనసుదోచుకున్న మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోతోంది. ట్రెడిషనల్ దుస్తులంటేనేఎప్పటికీ ఇష్టపడతానంటూ ఒక ఫోటోను ఆమె ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో అద్భుతంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కితాబిచ్చారు. మోడ్రన్ దుస్తులకంటే సాంప్రదాయక దుస్తులు మరింత మెరుగ్గా, అందంగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ముంబైలో తన ఫ్యావరెట్ హీరో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను మీరాబాయి చాను బుధవారం కలిశారు. ఈ ఫోటోలను కూడా ఆమె ట్వీట్ చేశారు. ఒలింపిక్ మెడల్ విజేతను కలవడం ఆనందంగా ఉందంటూ సల్మాన్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. మీరాబాయ్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుని సగ్వంగా సొంత గ్రామానికి చేరుకున్న చాను, అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. మణిపూర్ ప్రభుత్వం చానుకు కోటి రూపాయల రివార్డుతోపాటు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్న సంగతి తెలిసిందే.