ఓటుకు నోటు వివాదంలో ప్రముఖంగా వినిపించిన సండ్ర వెంకట వీరయ్య అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కేసుతో ఖమ్మం జిల్లాకు మాత్రమే తెలిసిన ఈయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. టీడీపీ నుంచి ఇటీవలే తెరాసలో చేరిన సండ్ర వెంకట వీరయ్యకు నిన్న తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇక నిన్న తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అక్కడి నుంచి తన సొంత నియోజక వర్గమైన సత్తుపల్లికి బయలు దేరారు. పెరేడ్ గ్రౌండ్ సమీపంలోని శివాలయం వద్ద సండ్ర కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన సండ్ర కారు డ్రైవర్ పక్కన వున్న కాలువను గమనించకుండా పక్కకు తప్పడంతో కారు కాలవలో దిగబడి పోయింది. దీంతో కారు ఒక పక్కకు వాలిపోయింది. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో సండ్ర తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో కాలువలో చిక్కుకున్న కారుని బయటికి తీశారు. దీంతో సండ్ర గన్‌మెన్‌లు, డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి నుండి బయలుదేరి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు.