Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాయాది దేశం అని ఆలోచించకుండా.మానవ హక్కుల కోసం పోరాడడం ఆ యువతి జీవితంలో తీరని విషాదం మిగిల్చింది. బాధ్యత గల మనిషిగా ప్రవర్తించడం.ఆమె జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. సమాజహితం కోసం పాటుపడే జర్నలిస్టుగా ఆమె మసలాలనుకుంటే.వ్యక్తిగతంగా ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రెండేళ్ల నుంచి కిడ్నాపర్ల చెరలో ఉంటూ.,.సురక్షితంగా బయటపడ్డ పాకిస్థానీ మహిళా జర్నలిస్టు జీనత్ షాజాదీ వ్యధ ఇది. లాహోర్ కు చెందిన 26 ఏళ్ల జీనత్ షాజాది నయీ ఖబర్ అనే స్థానిక దినపత్రికలో రిపోర్టర్ గా విధులు నిర్వర్తించేవారు. అన్యాయానికి గురైన భారత్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మద్దతుగా గొంతెత్తడం…సాఫీగా సాగుతున్న జీనత్ జీవితంలో ప్రకంపనలు రేపింది. ముంబైకి చెందిన ఐటీ ఇంజనీర్ హమీద్ అన్సారీ ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన పాకిస్థానీ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతిని కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లాలని భావించాడు. వీసాకు దరఖాస్తు చేశాడు. అయితే ఆయనకు పాకిస్థాన్ వీసా లభించలేదు. తాను ప్రేమించిన యువతిని ఎలాగైనా కలుసుకోవాలన్న ఉద్దేశంతో హమీద్ అన్సారీ అఫ్ఘనిస్థాన్ మీదగా పాకిస్థాన్ వెళ్లాలని భావించాడు.
2012 నవంబర్ 4న అక్రమంగా కాబూల్ వెళ్లాడు. ఆన్ లైన్ ఫ్రెండ్స్ సాయంతో కోహత్ పట్టణంలోని ఒక హోటల్ లో బస చేశాడు. వారం రోజుల తర్వాత హమీద్ అన్సారీని దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ పోలీసులు గూఢచర్యం కేసులో అరెస్టుచేశారు. అన్సారీ అరెస్టు విషయాన్ని పాక్ ప్రభుత్వం వెల్లడించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెలరేగింది. మూడేళ్లు కొడుకు కోసం అనేక ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు..అన్సారీ స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అతను పాకిస్థాన్ వెళ్లిన విషయం తెలుసుకున్నారు. పాక్ వెళ్లిన దగ్గరనుంచి కొడుకు కనిపించకుండాపోవడంతో అన్సారీ తల్లి పాకిస్థాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటనలో అన్సారీ తప్పేమీ లేదని గ్రహించిన జర్నలిస్ట్ జీనత్ షాజాది…. ఆయన తల్లికి సహాయపడేందుకు ముందుకు వచ్చారు. అన్సారీ కోసం..అతని తల్లి ఫౌజియా తరపున పాక్ సుప్రీంకోర్టులో మానవ హక్కుల విభాగంలో పిటిషన్ దాఖలుచేశారు.
ఓ భారతీయునికి పాకిస్థాన్ మహిళ మద్దతుగా నిలవడం… ఆ దేశంలో తీవ్ర కలకలం రేపింది. జీనత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత అన్సారీ తమ వద్దే ఉన్నాడని పాక్ భద్రతాసంస్థలు వెల్లడించాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే..2015 ఆగస్టు 19న ఆమె ఆటోలో ఆఫీస్ కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ భారతీయునికి మద్దతుగా నిలబడినందుకే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రపంచమంతా భావించింది. కిడ్నాపర్ల చెరలో ఉన్న జీనత్ ఆచూకీ కోసం ఆమె తమ్ముడు సద్దాం చేయని ప్రయత్నం లేదు. అక్క కోసం వెతికి వెతికి వేసారిన తమ్ముడు..ఆమె దొరకలేదన్న బాధను తట్టుకోలేక గత ఏడాది ఆత్మహత్య చేసుకోవడం జీనత్ జీవితంలో తీర్చలేని విషాదం. తమ్ముడి మరణం తర్వాత కూడా జీనత్ ఆచూకీ లభించలేదు. చివరకు కిడ్నాప్ జరిగిన రెండేళ్ల తరువాత గురువారం రాత్రి జీనత్ క్షేమంగా విడుదలయ్యారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ఆన్ ఎన్ ఫోర్స్ డ్ డిసప్పియరెన్స్ సీఐఈడీ చైర్మన్ జావెద్ ఇక్బాల్ ప్రకటించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని బలూచిస్తాన్ యువకులు, గిరిజనులు సాయంతో ఆమెను విడిపించామని తెలిపారు.
ఆమెను కుటుంబంతో కలపడం ఆనందంగా ఉందని బీనా సర్వర్ అనే సామాజిక కార్యకర్త చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో జీనత్ ఎక్కడుందీ..ఆమె జీవితం ఎలా గడిచింది అన్నదానిపై ఇంకా సమాచారం లేదు. ఓ బాద్యత గల జర్నలిస్టుగా న్యాయం తరపున నిలిచిందుకు జీనత్ షాజాదీ అనేక కష్టాల పాలయ్యారు. రెండేళ్లు కిడ్నాపర్ల చెరలో మగ్గారు. సొంత తమ్ముడిని పోగొట్టుకున్నారు. అయినా ఇప్పటికీ…ఆమె కోరుకున్న న్యాయం జరగలేదు. జీనత్ మద్దతుగా నిలిచిన హమీద్ అన్సారీ ఇంకా పాక్ జైల్లోనే మగ్గుతున్నాడు. పాక్ మానవ హక్కుల నేత రెహ్మాన్ అన్సారీ కోసం పోరాడుతున్నారు. పాక్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఉగ్రవాద సంస్థలు, మత చాంధసవాదం. ..కానీ ఆ దేశంలోనూ మానవ హక్కుల కోసం ప్రాణాలు పణంగా పెట్టేవారు ఉన్నారనడానికి జీనత్ షాజాది జీవితమే ఉదాహరణ.