క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి

క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బంతి

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త బంతిని వేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో టి20లో​ స్టార్క్‌ వేసిన ఆ బంతి లంక బ్యాటర్‌ దాసున్‌ షనకతో పాటు మిగతా ఆటగాళ్లను.. స్టాండ్స్‌లో ఉ‍న్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. స్లో యార్కర్‌ బాల్‌ వేయాలని భావించిన స్టార్క్‌ వ్యూహం విఫలమైంది.

దీంతో బంతి అతని చేతి నుంచి జారి షనక పక్కనుంచి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లి పక్కనున్న పిచ్‌పై పడింది. కీపర్‌ మాథ్యూ వేడ్‌ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో అది కాస్త బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్‌ నోబాల్‌తో పాటు ఫ్రీ హిట్‌ ఇచ్చాడు.  కాగా స్టార్క్‌ వేసిన నోబాల్‌.. క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త బంతిగా పరిగణించారు. ఇంతకముందు ఇలాంటివి జరిగినప్పటికి స్టార్క్‌ వేసిన బంతి దాదాపు 3 మీటర్ల ఎత్తులో వెళ్లడంతో చెత్త బంతిగా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మూడో టి20లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆసీస్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెప్టెన్‌ షనక 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. చండిమల్‌ 25 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మ్యాక్స్‌వెల్‌ 39, ఆరోన్‌ ఫించ్‌ 35 పరుగులతో రాణించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్‌ ఫిబ్రవరి 18న జరగనుంది.