మూడో స్థానానికి పడిపోయిన మిథాలీ రాజ్‌

మూడో స్థానానికి పడిపోయిన మిథాలీ రాజ్‌

భారత మహిళల వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తన టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో మిథాలీ విఫలం కావడం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్‌ 738 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా… రెండో స్థానంలో ఉన్న లిజెల్లే లీ 761 పాయింట్లతో తొలి ర్యాంక్‌ను అందుకుంది.

అదే విధంగా… భారత జట్టు మరో బ్యాటర్‌ స్మృతి మంధాన 710 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక బౌలర్లలో ఝలన్‌ గోస్వామి 727 పాయింట్లతో రెండు స్థానాలు పురోగమించి.. ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా ఝలన్‌ గోస్వామి 4 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. బ్యాట్‌తోనూ సత్తా చాటిన ఆమె… ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌-10లో నిలిచింది. ఈ విభాగంలో గతంలో టాప్‌-4లో ఉన్న దీప్తి శర్మ.. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది.