అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది.
కాగా, అంతకుముందు వారం పాక్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్‌కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది.