ప్రపంచ మహిళా క్రికెట్లో ఆమె ఓ సూపర్ స్టార్. భారత మహిళా క్రికెట్‌కు వెలుగు రేఖ… మగవారి ఆటగా ముద్రపడ్డ క్రికెట్లో.. మేమేం తక్కువా అంటూ స్త్రీ బావుటా ఎగురవేసిన ప్రతిభామూర్తి. తనే.. హైదరాబాదీ విమెన్ క్రికెటర్ మిథాలీరాజ్. ధనాధన్ ఇన్నింగ్స్ టీ20 లో మెరుపులు మెరిపించిన మిథాలీ… రిటైర్మెంట్ ప్రకటించింది.
ఎలాంటి ఊహాగానాలు లేకుండానే మిథాలి ఇచ్చిన రిటైర్మెంట్ అందరికీ షాకిచ్చింది. పదేళ్ల పసి ప్రాయంలోనే… క్రికెట్ బ్యాట్ పట్టిన మిథాలి… 16 ఏళ్లకే టీమ్ ఇండియా జట్టు జెర్సీని ధరించే స్థాయికి ఎదిగింది. 19 ఏళ్ల ప్రాయంలోనే… టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టి సంచలనం రేపింది. నాలుగేళ్లు తిరిగే సరికి ఏకంగా భారత జట్టుకే సారథి అయింది. మిథాలీ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్ రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరుకుని… చరిత్ర సృష్టించింది. మిథాలీ కెప్టెన్సీలో.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడమేగాక సిరీస్ గెలుచుకుని రికార్డ్ బ్రేక్ చేసింది.
ఫర్మ్యాట్ ఏదైనా… బ్యాట్ తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే మిథాలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 20-20ఫార్మాట్లో 89 మ్యాచులాడిన మిథాలీ రాజ్ 2364 పరుగులు చేసింది. ఇండియన్ విమెన్స్ టీమ్ లో టాప్ స్కోరర్ గా ఉంది. 2006 నుంచి ఈ ఫార్మాట్లో ఆడుతూ మొత్తం 32 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించింది. ఇందులో 2012, 2014, 2016 వరల్డ్ కప్‌లు కూడా ఉన్నాయి. 2021లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తోంది మిథాలీ. ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా మిథాలీ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌ని షాక్ కి గురిచేసింది.