మేడా చిచ్చు…పొగబెట్టారా…?

Rajampet MLA Meda Mallikarjuna Reddy Suspended From TDP

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజంపేట చిచ్చు రగిలిచింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ ఒక ఏడాది కాలంగా ఆయన వైసీపీలో చేరుతారన్న చర్చ ఊపందుకుంది. ఆయన సోదరులు దానికి ముఖ్య కారణం వైసీపీ ముఖ్యనేతలతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. పోటీ చేసింది మేడా అయినప్పటికీ ఆయన సోదరులే రాజకీయ వ్యవహారాలు చక్క బెడుతూంటారు. ఈ క్రమంలో ఈ వార్తలు వచ్చిన మొదటిలో ఒకటి, రెండు సార్లు చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన చంద్రబాబు పిలిచినా సమావేశానికి వెళ్లడం లేదు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమని టీడీపీ వర్గాలు డిసైడయ్యాయి. ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ రాజకీయాలను చక్క బెడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాజంపేటలో నిన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడాతో పాటు ఆయన వర్గీయులు ఎవర్నీ ఆహ్వానించలేదు. ఈ సమావేశంలో మేడా మల్లిఖార్జునరెడ్డిపై ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. పార్టీ నుంచి పోవాలనుకుంటే పోవచ్చని పార్టీలోనే ఉండి నష్టం చేయడం మంచిది కాదని ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. మేడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని 17వ తేదీన ముఖ్యమంత్రితో సమావేశం ఉందని పిలిచినా రాలేదని అన్నారు.

అయితే రాజంపేటలో ఆదినారాయణరెడ్డి టీడీపీ కార్యకర్తల భేటీ పెట్టడంతో పోటీకి మేడా మల్లిఖార్జున రెడ్డి కూడా రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండల నాయకులతో భేటీ అయ్యారట. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కార్యకర్తలతో భేటీ తర్వాత ఎమ్మెల్యే మేడా మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు. పార్టీకి తనను దూరం చేసేందుకే మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. అందుకే తనను ఆహ్వానించకుండా సమావేశం ఏర్పాటు చేశారని తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొడ్డి దారిన మంత్రి అయి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనవసరంగా అబాండాలు వేస్తూ మంత్రి తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22న చంద్రబాబును కలిసి తన బాధను చెప్పుకుంటానన్నారు. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. మొత్తానికి మేడా మల్లిఖార్జున రెడ్డి వ్యవహారం కడప టీడీపీలో కలకలం రేపుతోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ఇప్పటికే టీడీపీ హైకమాండ్‌కు క్లారిటీ ఉండటంతో కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహిస్తోంది. ఆ బాధ్యతను ఆదినారాయణరెడ్డి తీసుకున్నారు. వాస్తవానికి కడప జిల్లా మొత్తం మీద టిడిపి రాజంపేట స్థానం ఒక్కటే గెలిచింది. కానీ వైసిపి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టిడిపి పంచన చేరి మంత్రి పదవి కూడా సంపాదించారు. అప్పటినుండి జిల్లాలో టిడిపి కార్యక్రమాలను సహా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన నేతృత్వంలో జరుగుతున్నాయి. అయితే ముందు నుండి పార్టీలో ఉన్న తమను పట్టించుకోకుండా వెనక వచ్చినవారికి మంత్రి పదవి ఇవ్వటమే కాక అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి.