ఈ సారి బాబు హోస్టింగ్ లో విపక్ష సభ…!

Chandrababu Naidu To Sit On Fast Today Over Special Status For Andhra Pradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్రంలోని మోడీ స‌ర్కారు చేసిన అన్యాయం మీద టీడీపీ స‌ర్కారు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లు ప్రారంభించిన‌ప్పుడే ఓ ప్ర‌తిపాద‌న‌ను సీఎం చంద్ర‌బాబు తెచ్చారు. జిల్లాల‌వారీగా ధ‌ర్మ‌పోరాట స‌భ‌లు పూర్త‌య్యాక‌, చివ‌రి స‌భ‌ను భారీ ఎత్తున‌ అమ‌రావ‌తిలో నిర్వ‌హించాల‌నీ, ఆ కార్య‌క్ర‌మానికి జాతీయ నేత‌ల్ని ఆహ్వానించాల‌ని అనుకున్నారు. దానికి సంబంధించిన చ‌ర్చ కలకత్తాలో కొంత‌మంది నేత‌ల మ‌ధ్య జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కలకత్తాలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ అనంతరం స‌భ ముగిసిన త‌రువాత మ‌మ‌తా బెన‌ర్జీ, శ‌ర‌ద్ ప‌వార్ ల‌తోపాటు కొంత‌మంది నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. భాజ‌పాయేత‌ర కాంగ్రెస్ అనుకూల పార్టీల కూట‌మి తొలిస‌భ విజ‌యం కావ‌డంతో, దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించాల్సిన స‌భ‌ల‌ మీద అక్కడ చ‌ర్చ జ‌రిగిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రెండో స‌భ‌ను అమ‌రావ‌తిలో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 15 త‌రువాత ఈ స‌భ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల‌కు ఇంకా పోరాట దీక్షలు జరపలేదు.

ఈ జిల్లాలకు సంబంధించిన రెండు ధ‌ర్మ‌ పోరాట దీక్ష‌ల్నీ ఒక వేదిక మీద నుండి ఒకే సారి జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారట. ఆ పోరాట దీక్షే ప్రాంతీయ పార్టీల కూటమి రెండో సభకీ వేదిక కాబోతోందని సమాచారం. అమ‌రావ‌తి స‌భ‌కు ప్ర‌ముఖ జాతీయ నేత‌ల్ని ఆహ్వానించ‌డంతోపాటు, కలకత్తా స‌భ‌కు హాజ‌రుకాని రాజ‌కీయ పార్టీల‌తో కూడా చ‌ర్చించి, అమ‌రావ‌తికి వ‌చ్చేలా చేయాలనీ భావిస్తున్నారు. ల‌క్షల మంది ప్ర‌జ‌ల‌తో ఈ స‌భ‌లో ఏపీలో టీడీపీ స‌త్తా ఏమిటో చాటుకునే ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో లోక్ స‌భ‌తోపాటు, అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి కాబ‌ట్టి, పెద్ద సంఖ్య‌లో జాతీయ నేత‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ స‌భ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా భారీ ప్రారంభంగా ఉప‌యోగ‌ప‌డుతుంది అనేదీ సీఎం ఆలోచ‌న‌గా ఉంద‌నీ స‌మాచారం. ఇదే విషయాన్ని నిన్న మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఎప్పుడు ఏమిటి అనేది ఆయన క్లారిటీ ఇవ్వక పోయినా ఖచ్చితంగా అమరావతిలో సభ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.