చంద్రబాబు విధి ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు డ్రామాపై ఆర్కే రోజా మాట్లాడుతూ.. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడ్పించావో గుర్తుందా బాబు?. 71 ఏళ్ల 7 నెలలకే నీకు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుందని.
మీ కుటుంబ సభ్యుల్ని అన్నారని తెగ బాధపడిపోతున్నావే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అసెంబ్లీలో నామీద పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా?. అంటే మాకు కుటుంబాలు కానీ, మర్యాదలు కానీ లేవనుకున్నావా?. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవర్ని ఏదైనా అంటావు.మా నాయకుడి కుటుంబ సభ్యుల్ని ఎంత ఏడ్పించావో ఎవరూ మర్చిపోలేదు.
కాబట్టి ఈ రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడ్పులు ఏడ్చే నిన్ను ఎవరూ జాలితో కూడా చూడరని తెలుసుకో. ఎందుకంటే ప్రధాని మోదీతో సహా ఎవర్నీ వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు సోషల్ మీడియాతో ఎన్ని అసత్య వార్తలు వ్యాప్తి చేశావు అనేది ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉన్నారు. నీ కోసం, నీ పార్టీ కోసం పదేళ్లు కష్టపడిన మహిళ అని కూడా కనికరం లేకుండా నా క్యారెక్టర్‌ను అవమానించారు.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి నన్ను మానసికంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. మహిళా పార్లమెంట్‌కు పిలిచి నన్ను 24 గంటలు డిటెయిన్ చేసి నన్ను మానసిక క్షోభకు గురిచేశారు. ఈ విషయాలన్ని ప్రజలు ఎవరూ అంత త్వరగా మర్చిపోరు. నన్ను రూల్స్‌కు విరుద్ధంగా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయగలిగావు. కానీ దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరాలు కాదు కదా జీవితంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టని విధంగా నీకు నువ్వే శపథం చేసుకున్నావు. బాయ్ బాయ్ బాబూ’ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.