Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేనానిపై వైస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, ప్యాకేజీ స్టారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కు ఓ ప్యాకేజీ ఇచ్చి తీసుకువస్తారని, అందువల్లే ఆయన టీడీపీని విమర్శించరని రోజా ఆరోపించారు. పవన్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, దానికి ముందుగా వారసత్వ సినిమాల గురించి మాట్లాడాలని సలహాఇచ్చారు. చిరంజీవిని మోసం చేసిన వారందరూ తనకు తెలుసుని, వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని పవన్ చేసిన హెచ్చరికలపైనా రోజా ఘాటుగా స్పందించారు.
పవన్ ముందు తనను తాను శిక్షించుకోవాలని ఎందుకంటే..చిరంజీవిని మోసం చేసింది ఆయనేనని ఆరోపించారు. క్షమించమని అన్నయ్యను కోరాలని పవన్ కు సూచించారు. చిరంజీవికి ద్రోహం చేసిన వాళ్లల్లో మొదట పవన్ ఉన్నారని, తర్వాత చిరంజీవి బావ అల్లుఅరవింద్ ఉన్నారని, ఆ తర్వాత చంద్రబాబు, ఆయన చానల్స్ ఉన్నాయని, అందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఎవరో చేశారని, వాళ్లను వదలిపెట్టనని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజారాజ్యం గెలిచి చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని భావించి పవన్ 2009లో యువనేతగా ప్రచారం చేశారని, పార్టీకి 18 సీట్లు మాత్రమే వచ్చాయని తెలిసి అన్నయ్యను గాల్లోకి వదిలేసి షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేశారని రోజా ఆరోపించారు. పవన్ మాట్లాడే మాటలకు, చేతలకు సంబంధం లేదని, కృష్ణానదిలో బోటు బోల్తా ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందని లండన్ లో విద్యార్థి అడిగేదాకా పవన్ కు తెలియకపోవడం సిగ్గుచేటని రోజా మండిపడ్డారు. పోలవరం గురించీ పవన్ కళ్యాణ్ కు ఏమన్నా తెలుసా అని రోజా ప్రశ్నించారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసి పనిచేయాలని జగన్ పెట్టిన ప్రతిపాదనను పవన్ అంగీకరించకపోవడంతో … ఆ పార్టీ నేతలు జనసేనానిని విమర్శిస్తూ అక్కసు తీర్చుకుంటున్నారని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.