ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి టీడీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీనీ వీడిపోవడంతో బాగా చతికిలపడిన ఆ పార్టీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా గుడ్‌బై చెప్పబోతున్నారని కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా అక్టోబర్ 3వ తేదిన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని అనుకున్నప్పటికి అది మాత్రం జరిగేలా కనిపించడం లేదు.
వైసీపీలో చేరాలంటే తమ పదవలకు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ ముందుగానే చెప్పడంతో ఇప్పుడు నేతలు రూట్ మార్చారు. తమ పదవులు పోకుండా వైసీపీకి పరోక్షంగా మద్ధతు తెలుపుతూ వారసులను ఆ పార్టీలో చేర్చుతున్నారు. ఇటీవల విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన ఇద్దరు కుమారులను జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. అయితే ఇప్పుడు గంటా కూడా అదే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. గంటా కుమారుడు రవితేజ తన తండ్రి సమక్షంలోనే రేపు వైసీపీలో చేరబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రవితేజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.