Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన బీజేపీ కురువృద్దుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, నిన్న స్వల్ప అస్వస్థతకు గురికాగా, ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ వర్గాలు ఆందోళన చెందుతాయని ఆయనకి ఏమీ కాలేదని మామూలు పరీక్షల కోసమే ఆయన్ని తీసుకుని వెళ్లినట్టు చెప్పినా ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాల సమాచారం. చాలా కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితో పాటు, మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాహుల్ గాంధీ, అమిత్ షా, అద్వానీ, జేపీ నడ్డా, సుష్మా స్వరాజ్ వంటి దిగ్గజ రాజకీయ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి రావడం వాజ్ పేయి అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. వాజపేయి ని పరామర్శించేందుకు వచ్చిన ప్రధాని మోదీ 50 నిమిషాల సేపు ఎయిమ్స్ లోనే ఉన్నారు. కాగా, దీర్ఘకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం తనను పరామర్శించేందుకు వచ్చిన వారిని గుర్తించే పరిస్థితిగానీ, వారితో మాట్లాడే పరిస్థితిలోగానీ లేరు.