జోహన్నెస్‌బర్గ్‌లో మోదీ, జిన్‌పింగ్‌ల ముచ్చట్లు..

Modi and Xi Jinping's hugs in Johannesburg
Modi and Xi Jinping's hugs in Johannesburg

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అయితే తాజాగా ఈ వేదికపై మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సంభాషణ జరిగింది. ఈ సంభాషణను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ-LAC వెంబడి “పరిష్కారం కాని” సమస్యలపై భారత్ ఆందోళనలను జిన్‌పింగ్‌కు ప్రధాని తెలియజేసినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత ,శాంతి భద్రతలను కాపాడుకోవడం అవసరమని జిన్‌పింగ్‌తో మోదీ చెప్పారని వినయ్ క్వాత్రా తెలిపారు.

భారత్, చైనా మధ్య సాధారణ పరిస్థితుల కోసం సరిహద్దులో ప్రశాంతత ,శాంతి భద్రతలు ముఖ్యమని మోదీ చెప్పినట్లు క్వాత్రా వివరించారు. వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య నిర్మాణాత్మక ద్వైపాక్షిక సమావేశం మాత్రం జరగలేదని తెలుస్తోంది. శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశానికి ముందు ఇరుదేశాల అధినేతలు కాసేపు మాట్లాడుకున్నారు. దక్షిణాఫ్రికా మీడియా ఈ వీడియోను ప్రసారం చేసింది.