ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ప్రధాని వాటికి బదులిచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు.