గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అకాల మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం దేశ సంగీత రంగానికి తీరని లోటు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది’ అని రాష్ట్రపతి ట్విటర్‌లో పేర్కొన్నారు. బాలుని పాటల జాబిల్లిగా అభిమానులు కీర్తిస్తారని గుర్తు చేశారు. పాటల ప్రపంచానికి బాలు సేవలకుగాను పద్మ భూషణ్, జాతీయ అవార్డులు, మరెన్నో పురస్కారాలు వరించాయని తెలిపారు.
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు మృతి దురదృష్టకర సంఘటన అని ప్రదాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. బాలు మరణంతో దేశ సాంస్కృతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. బాలు సుమధుర గొంతుక యావత్ భారతంలోని ప్రతి ఇంటికి సుపరిచితమని ప్రధాని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పాటల ప్రపంచానికి సేవ చేసిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు.
‘ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు, శేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’అని మోదీ ట్వీట్ చేశారు. బాలు మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు.