పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు

పాక్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు

పాకిస్థాన్ నూతన ప్రధానిగా సోమవారం ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాద రహితంగా శాంతి, స్థిరత్వాన్ని భారత్ కోరుకుంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించవచ్చని, ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

‘‘పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన హెచ్‌ఈ మియాన్‌ ముహమ్మద్‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు శుభాకాంక్షలు.. ఉగ్రవాదరహిత ప్రాంతంగా ఉండాలని, శాంతి, స్థిరత్వాన్ని భారల్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది.. దీని వల్ల మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించవచ్చు.. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

అనేక మలుపుల తిరిగిన పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం.. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యంతో కొలిక్కి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా సోమవారం ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి ఆయనకు సంపూర్ణ మద్దతు లభించింది. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చివరి నిమిషంలో తన అభ్యర్థిని ఉపసహరించుకుంది.

పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ 23 వ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి స్వయానా సోదరుడు. మొత్తం 324 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో షెహబాజ్‌కు 174 మంది మద్దతు తెలిపారు. దొంగలతో కలిసి తాము జాతీయ అసెంబ్లీలో కూర్చోలేమంటూ పీటీఐ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. విదేశీ ఎజెండాతో ఏర్పాటయ్యే ఏ ప్రభుత్వంలోనూ తాము భాగస్వాములం కాలేమని ఇమ్రాన్ నాయకత్వంలోని పీటీఐ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా, ప్రధాని అయిన మొదటి రోజే షెహబాజ్‌ షరీఫ్‌ భారత్ విషయంలో తన నైజం బయటపెట్టుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. కశ్మీర్ విషయంలో భారత్‌పై విషం చిమ్ముతూ మాట్లాడారు. కశ్మీర్‌ లోయ నెత్తురోడుతోందని, అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామని ఉద్ఘాటించారు.

కశ్మీర్‌ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్2కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేసినా ఇమ్రాన్ ఖాన్ సీరియస్‌గా తీసుకోలేదని, దౌత్యపరంగా పరిష్కారానికి ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు.అదే సమయంలో చైనాతో సంబంధాలు మరింత బలపడతాయని స్పష్టం చేశారు. చైనా సహకారంతో ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని అన్నారు.