క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి షాక్

క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి షాక్

దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ క్యాబ్‌ సర్వీసులు అధిక సంఖ్యలో నడుస్తాయి. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో నేచురల్‌ గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ప్రయాణ ఛార్జీలను 12 శాతం మేర పెంచుతున్నట్లు ఉబర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.కొద్ది రోజల క్రితమే ముంబై, హైదరాబాద్‌లో క్యాబ్‌ సర్వీసుల ధరలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లోని క్యాబ్‌ డ్రైవర్లు ధరలను పెంచాలని నిరసనలు కూడా చేపట్టారు. ఇక రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఆయా క్యాబ్‌ సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇలాగే ఇంధన ధరలు పెరిగితే క్యాబ్‌ సర్వీసుల ధరలు పెంపు అనివార్యమని తెలుస్తోంది.

ఇంధన ధరల పెంపుతో క్యాబ్‌ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్‌ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. వాహనాల్లో ఎసీను స్విచ్‌ ఆన్‌ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్‌ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఏసీలను ఆన్‌ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్‌ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు.