ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన మోదీ దేశ ప్రధానిగా వరుసగా రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా అత్యధిక కాలం పనిచేసిన వారి సరసన మోదీ చేరారు. బుధవారం ఆయన ప్రభుత్వాధినేతగా 20వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని, భారత్తో పాటు ప్రపంచం శాంతి సౌఖ్యాలతో విలసిల్లేలా ఆయన మరింత శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో దీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన ప్రధాని మోదీని అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, దివంగత బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ వంటి ప్రపంచ నేతలతో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పోల్చారు. ప్రభుత్వాధినేతగా 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోదీకి పలువురు బీజేపీ నేతలు, మంత్రులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు నరేంద్ర మోదీ 2001 నుంచి 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.