మోదీ నాలుగు రోజుల పర్యటన

మోదీ నాలుగు రోజుల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం అమెరికా బయలుదేరారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 25వ తేదీ వరకు మోదీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ నేతలతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు.

ఈ స‌మావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడ‌న్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జ‌పాన్ ప్రధాని యోషిహిదే సుగాతో కలిసి భార‌త ప్రధాని మోదీ పాల్గొన‌నున్నారు. ఈ మార్చిలో జో బైడన్ వర్చువ‌ల్‌గా క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జరిగే సమావేశంలో భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నట్టు మోదీ తన ప్రకటనలో వెల్లడించారు. తను అమెరికా వెళ్లే కొద్దిసేపటి ముందు ట్వీట్ చేసిన మోదీ.. బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు పయనమైనట్లు తెలిపారు.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని ప్రసంగించనున్నారు. కొవిడ్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌తో చర్చించనున్నారు. ప్రముఖ యూఎస్‌ కంపెనీల సీఈఐలతో కూడా మోదీ భేటీ కానున్నారు. ఇక, మోదీ సెప్టెంబర్ 26న తిరిగి ఇండియో చేరుకోనున్నారు.