భారత్ మానవతా సాయాన్ని పాలస్తీనా ప్రజలకు పంపిస్తూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ఆయన మాట్లాడారు. మానవతా సాయం అందించడంలో భారత్ ఎప్పుడూ తోడుంటుందని అబ్బాస్‌కు మోదీ హామిచ్చారు. గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో పెను ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మోదీ తెలియజేశారు. ఇందుకు గల కారకులకు శిక్ష పడాలన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం అనుసరిస్తున్న దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు గాజాలో జరుగుతున్న ఉగ్రదాడులను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. భారత్ దాన్ని ఉపేక్షించదని స్పష్టం చేశారు. గాజా ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గాజా నుంచి భారతీయులను తీసుకురావడం చాలా క్లిష్టతరమైనదని తెలిపారు. ఏ చిన్న అవకాశం దొరికినా వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తామని.. అయితే అప్పటి వరకు వారు అక్కడ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన దాడుల్లో మరణించిన వారిలో భారతీయులు ఎవరూ లేరని బాగ్చి వెల్లడించారు.