Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలున్నాయనగా భారీ దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సహా అనేక చోట్ల తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఇక మోదీ-షాల కనికట్టు పనిచేయడం లేదన్న నగ్న సత్యం అందరికీ బోధపడి వారికి చావు దెబ్బ వేశారు. నాలుగేళ్లుగా మోడీ మానియాని ఎదురించలేక అష్ట కష్టాలు పడుతున్న ప్రతిపక్షాలకు… ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలకు ఈ ఫాలితాలు భారీ ఊరటను అంతకు మించి ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గుజరాత్ ఎన్నికల్లో ఎలాగోలా ముక్కారు. రాజస్థాన్ – మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు పళ్ళు బయట పెట్టి మరీ వెక్కిరించాయి… ఇక కర్ణాటకలో తమ ‘గాలి’ వీస్తుందనుకుంటే కాంగ్రెస్ హస్తం పెట్టి ఆపేసింది… ఇప్పుడు దేశంలోని పది రాష్ట్రాల్లో జరిగిన నాలుగు పార్లమెంటు – 10 అసెంబ్లీ స్థానలకు జరిగిన ఉప ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. నిన్న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో నాలుగు పార్లమెంటు స్థానాలకి గాను ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ, మరో చోట బీజేపీ మిత్రపక్షం గెలిచింది. ఇక 10 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 9 చోట్ల బిజెపి ఓడిపోయింది. సిటింగ్ స్థానాలు కూడా కోల్పోవాల్సి రావడం బీజేపీకి అతిపెద్ద చెంప పెట్టుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని కైరానా – మహారాష్ట్రలోని పాల్గర్ – భండారా-గోండియా – నాగాలాండ్ పార్లమెంటు స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఉస్సూరుమనిపించింది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోక్ సభ స్ధానాల్లో 3 బీజీపీ సిట్టింగ్ స్థానాలు కాగా ఒకటి ఆ పార్టీ మిత్రపక్షం ఎన్డీపీపీది. ఇక అసెంబ్లీ ఉప ఎన్నికల దగ్గరకొస్తే బిజెపికి ఇక్కడ కూడా పెద్ద దెబ్బే తగిలింది. కర్నాటక ఆర్ ఆర్ నగర్ నియోజకవర్గంలో, మహారాష్ట్రలో పాలన్ కడేగావ్ లో అలాగే మేఘాలయాలోని అంపతి లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. ఇక మరో పక్క పంజాబ్ లోని అకాలీదళ్ సిట్టింగ్ స్థానం అయిన షాకోట్ లో అకాలీదల్ అభ్యర్ధిపై కాంగ్రెస్ అభ్యర్ధి గెలవడం చూస్తుంటే బీజేపీ నే కాదు బీజేపీ మిత్రపక్షం అయినా వదిలేది లేదు అన్నట్టు ప్రజలు తీర్పునిచ్చారు. ఇక గెలుపు నల్లేరు పై నడకే అని భావించి రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ లోని నూర్పూర్ నియోజకవర్గంలో బిజెపికి ఊహించని పరాభవం ఎదురైంది. తమ సిట్టింగ్ స్ధానాన్ని ఎస్పీ అభ్యర్ధికి వదులుకోవాల్సి వచ్చింది యోగీ సారధ్యంలోని బీజేపీ సర్కారు.
ఇక పశ్చిమ బెంగాల్ లోని మహేస్ధలలో టిఎంసి అభ్యర్ధి గెలిచారు. కేరళలోని చెంగన్నూరు నియోజకవర్గంలో సిపిఎం, బీహార్ లోని జోకిహాట్ నియోజకవర్గంలో బీజేపీ కూటమిలోని జెడియుకి షాకిస్తూ ఆర్జెడియు అభ్యర్ధి గెలిచారు. ఇక జార్ఖండ్ లోని గోమియా స్ధానంలో బిజెపి అభ్యర్ధి స్దానంలో అక్కడి జెఎంఎం అభ్యర్ధి గెలిచారు. ఉత్తరాఖండ్ లోని థరేలీలో మాత్రం బిజెపి గెలిచింది. ఇక కైరానా నియోజకవర్గంలో విపక్షాలన్నీ ఏకమై బీజేపీని దెబ్బకొట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో థర్డ్ ఫ్రంట్ మీద చర్చ సాగుతోంది. ఇక ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మాటలు చాలు, పని మొదలుపెట్టండనే సంకేతాన్ని ప్రజలు మోడీకి ఇచ్చారని ఏపీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేకపోవడం… మోడీకి తగ్గిన ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ పతనానికి పునాది వేసింది మనమే అని ఆయన పేర్కొన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయే. ఇప్పుడు బిహార్లో నితీశ్ కుమార్ కూడా కమలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈ సారి రానున్న ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని అర్ధం అవుతోంది.