మోడీ పాత ప‌గ తీర్చుకుంటున్నారా…?

Modi takes Revenge On Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఆ త‌ర్వాత‌… మంచి మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీకి మ‌ధ్య‌లో ఎందుకు చెడింది?
విభ‌జ‌న సంద‌ర్భంగా పార్ల‌మెంట్ లో అప్ప‌టి కేంద్ర‌ప్రభుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఉన్న ప్ర‌ధాన‌మంత్రి ఎందుకు రాష్ట్రంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? ఎన్నిక‌ల సంద‌ర్భంగా స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాల‌ను మోడీ ఎందుకు ప‌క్క‌నపెట్టారు? తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ స్థాయిలోనూ వాడీవేడిగా జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. కేంద్ర‌బ‌డ్జెట్ త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం కేంద్రంపై తిరుగుబాటు చేసిన ద‌గ్గ‌ర‌నుంచి… ఇప్ప‌టిదాకా అనేక‌మంది ఈ అంశంపై విశ్లేషణ చేస్తూనే ఉన్నారు. అనేక‌మంది అనేక ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తంచేసినప్ప‌టికీ… ఎక్కువ‌మంది చెబుతున్న మాట‌… ఒక‌ప్పుడు చంద్ర‌బాబు చేసిన ప‌నికి మోడీ ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నార‌ని.

2002లో మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన అల్ల‌ర్ల త‌ర్వాత‌… ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వినుంచి త‌ప్పించాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ బ‌య‌లుదేరింది. అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి వాజ్ పేయిపై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు, మిత్ర‌ప‌క్షాలు సైతం ఒత్తిడి పెంచాయి. మోడీని త‌ప్పించాల‌న్న డిమాండ్ మిత్ర‌ప‌క్షం హోదాలో మొద‌టిగా చేసింది ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు. అప్ప‌టి ఎన్డీఏ ప్ర‌భుత్వానికి కీల‌క‌మ‌ద్ద‌తుదార‌యిన చంద్ర‌బాబు మోడీని త‌ప్పించాల‌ని ప‌దే ప‌దే కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆ త‌రుణంలో ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబును క‌లిసేందుకు మోడీ ఏపీ భ‌వ‌న్ కు వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించినా… బాబు, ఆయ‌న్ను క‌లిసేందుకు అంగీక‌రించ‌లేదు. ఇది మోడీని చాలా బాధించింది. అయితే అప్ప‌టి కేంద్ర‌ప్ర‌భుత్వం టీడీపీ స‌హా ఏ రాజ‌కీయ పార్టీ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌లేదు. మోడీని తొల‌గించ‌డానికి అద్వానీ ఒప్పుకోక‌పోవ‌డంతో… ఆయ‌న ప‌ద‌విలో కొన‌సాగారు. ఇది జ‌రిగి చాలా ఏళ్లు గ‌డిచిపోయింది.

అయితే ఇప్ప‌టి టీడీపీ, బీజేపీ మిత్ర‌బంధం ఇలా గాడిత‌ప్ప‌డానికి ఆనాటి ప‌రిస్థితులే కార‌ణ‌మ‌న్న‌ది కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. త‌న‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేయ‌డం, త‌న‌ను క‌లిసేందుకు అంగీక‌రించ‌పోవ‌డం వంటివి చేసిన చంద్ర‌బాబుపై మోడీ అద‌ను చూసి ప‌గ తీర్చుకున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తంచేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబును జాతీయ మీడియా కూడా ఇదే ప్ర‌శ్నించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల త‌ర్వాత మోడీని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని అంద‌రిక‌న్నా ముందుగా మీరే డిమాండ్ చేశారు క‌దా… అని మీడియా ప్ర‌శ్నించ‌గా… చంద్ర‌బాబు అవున‌ని సమాధాన‌మిచ్చారు. జ‌రిగిన విష‌యాల‌ను చ‌రిత్ర రికార్డుల నుంచి ఎవ‌రూ చెరిపివేయ‌లేర‌ని బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే తాను మోడీతో చేతులు క‌లిపాన‌ని, కానీ ఆయ‌న ఇలా చేస్తార‌ని అనుకోలేద‌ని చెప్పారు. అప్ప‌ట్లో మీర‌న్న మాట‌ల‌ను మోడీ గుర్తుంచుకున్నారేమో అని మీడియా ప్ర‌శ్నించ‌గా… గుర్తుంచుకుని ఉండొచ్చేమో అని న‌వ్వారు చంద్ర‌బాబు. త‌న‌కు మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని స్ప‌ష్టంచేశారు.

మ‌రో అంశంపైనా జాతీయ మీడియా ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించింది. ఏపీకి కేంద్రం సాయం చేస్తే, అభివృద్ధిలో ఇత‌ర రాష్ట్రాల‌ను అధిగ‌మిస్తుంద‌నే భావ‌న‌తో మోడీ మీకు స‌హాయం చేయ‌డం లేదా… అని అడ‌గ్గా… ఆ విష‌యాన్ని మీరే గ్ర‌హించాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఏపీ ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సానుకూలంగా స్పందించ‌డం లేదా అని అడిగిన ప్ర‌శ్న‌కు ముఖ్య‌మంత్రి ఔన‌ని స‌మాధాన‌మిచ్చారు. ఏపీకీ జ‌రుగుతున్న అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెస్సేత‌ర పార్టీల‌కు వివ‌రించేందుకే తాను ఢిల్లీ వ‌చ్చాన‌ని, ప్ర‌స్తుతం త‌న‌కు రాజ‌కీయాలు ముఖ్యం కాద‌ని, ఏపీకి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డ‌మే ముఖ్య‌మ‌ని చంద్ర‌బాబు తెలిపారు. మొత్తానికి మోడీ చంద్ర‌బాబుపై పాత ప‌గ తీర్చుకుంటున్నార‌న్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌… జాతీయస్థాయిలోనూ వ్య‌క్త‌మ‌వుతోందన్న‌మాట‌.