విశాఖకు మోడీ…కట్టుదిట్టం !

Modi To Visit Visakhapatnam Today

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఈ ఏడాది లో రెండవ సారి ఆంధ్రప్రదేశ్‌ కు వస్తున్నారు. విశాఖ రైల్వే మైదానంలో నేటి సాయంత్రం నిర్వహించనున్న ‘ప్రజా చైతన్య సభ’లో మోదీ పాల్గొంటారు. ఇందుకోసం విశాఖ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దింపారు. ఈ సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత నెల గుంటూరులో నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ’లో మోదీ ఎలాంటి వరాలు కురిపించలేదు. దీంతో అధికార టీడీపీ సహా ఇతర పార్టీలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఆ సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఆఫ్ ది రికార్డ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు విశాఖ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఈసారి మోదీ రాకకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా మారిన రైల్వేజోన్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను తొలగించి దాని స్థానంలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్‌ను మంజూరు చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే ఉద్యోగులతో సహా పలు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు డివిజన్‌కు కోతపెట్టడం, జోన్‌ సరిహద్దులపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాజపా వైఖరికి నిరసనగా తెదేపా నాయకులు శుక్రవారం నగరంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించడంతో ప్రధాని సభకు ఎలాంటి అవాంతరాలు తలెత్తుతాయోనని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సాయంత్రం 6.20 గంటలకు వైమానిక దళ ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం ఐ.ఎన్‌.ఎస్‌.డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే మైదానానికి గం.6.45కి వస్తారు. 6.55 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభం అవుతుంది. 45 నిమిషాలపాటు.. అంటే రాత్రి 7.40 గంటల వరకు ప్రధాని ప్రసంగం కొనసాగుతుంది. తిరిగి 7.55 గంటలకు వేదిక నుంచి బయలుదేరి ఐ.ఎన్‌.ఎస్‌.డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు.