Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్రిపుల్ తలాక్ నేపథ్యంగా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ పోలీసుల దగ్గరకు వచ్చిన ఓ కేసు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. అది అసలు ట్రిపుల్ తలాక్ వల్ల వచ్చిన సమస్యా లేక…వివాహేతర బంధాల ఆరోపణల ఫలితమా అన్నది అర్ధం కాక రాయ్ బరేలీ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్లే…ప్రధాని మోడీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ ఎన్నికల ర్యాలీలో రాయ్ బరేలీకి చెందిన ఫయ్ రా అనే ముస్లింమహిళ పాల్గొంది. ర్యాలీ అనంతరం ఇంటికి వెళ్లిన తనకు భర్త డానిష్ ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఫయ్ రా బరేలీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తనను, తన కుమారుడిని తీవ్రంగా గాయపరిచాడని విలపించింది.
ట్రిపుల్ తలాక్ విషయంలో మోడీ ఏం చేయలేరని తన భర్త తనతో అన్నాడని తెలిపింది. మోడీ ర్యాలీకి హాజరయినందుకే భర్త విడాకులు ఇచ్చాడని ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా తాను మోడీ సభకు హాజరయితే..తన భర్త అర్ధం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తన భర్తకు వివాహేతర బంధం ఉందని, అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. అయితే ఫయ్ రా భర్త డానిష్ వాదన మరోలా ఉంది. తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతను ఆరోపిస్తున్నాడు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చాననడం నిజం కాదన్నాడు. ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధంగా ఆమె వస్త్రధారణ ఉంటోందని, తన భార్యను భరించడం తన వల్ల కాదని అతనంటున్నాడు. వీరిద్దరిలో ఎవరి మాటలు నిజమో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.