భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల్లో ముందడుగు పడింది. ఇరు దేశాల అధినేతలు సుహృద్భావ వాతావరణంలో కీలక చర్చలు జరిపారు. భవిష్యత్ ప్రణాళికలు… ఇకపై ముందుకెలా సాగాలో తీర్మానించారు. ఉహాన్‌లో కలిసిన ప్రధాని మోదీ-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు చేతులు కలుపుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తర్వాత ఇద్దరు సమావశేమై… వారి, వారి అభిప్రాయాలను, ఆలోచనల్ని పంచుకున్నారు.
ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి… భవిష్యత్ కార్యాచరణలపై కూడా దృష్టిసారించారు. 2019లో మరోసారి భారత్‌లో కలిసి… ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చిద్దామని జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు. ఎన్నో శతాబ్దాలుగా భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను పోషిస్తున్నాయన్న ప్రధాని… ఇకపైనా భారత్-చైనాలు ఇదే దూకుడ్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.మోదీ ఆహ్వానంపై జిన్‌పింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి స్నేహాన్ని కొనసాగిద్దామని… తప్పకుండా మరోసారి కలుద్దామన్నారు.
ఇరు దేశాలు ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ… భవిష్యత్‌లోనూ స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి విషయంలో కూడా పరస్పరం సహకరించుకుంటూ… వాణిజ్యపరంగా కూడా కలిసి నడవాలని తీర్మానించారు. గత ఐదేళ్లుగా భారత్-చైనాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని… రాబోయే రోజుల్లోనూ ఇలాంటి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలన్నారు జిన్‌పింగ్. శనివారం కూడా ఇద్దరు దేశాధినేతలు మరోసారి భేటీకానున్నారు. బోటులో విహరిస్తూ… లంచ్ మీట్‌లో కలవనున్నారు.