తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు పాత పార్లమెంటు భవనం సాక్షిగా నిలిచిందని అన్నారు. పార్లమెంటు తలుపులు మూసివేసి, తీవ్ర అశాంతి వాతావరణంలో తెలంగాణ బిల్లుని పాస్ చేశారని అన్నారు.
నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలా చేసి ఉంటే ఆంధ్ర ప్రదేశ్-తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు వచ్చి ఉండేవి కాదని అన్నారు. ఇక పాత పార్లమెంట్ భవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంచుతామని వెల్లడించారు. ఆ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందని.. తొలిసారి ఎంపీగా అడుగు పెట్టినప్పుడు పార్లమెంట్ గడపకు శిరసా నమస్కరించానని తెలిపారు. 75 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఎన్నో మార్పులు జరిగాయని అన్నారు. తొలి సభలో 22 మంది మహిళ ఎంపీలు ఉండగా.. ప్రస్తుతం సభలో వారి సంఖ్య 78 గా ఉందన్నారు. ఇంతమంది మహిళలు ఏ సభలోనూ లేరని వివరించారు.