Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యుక్త వయసులో క్రికెట్ బ్యాట్, బంతి పట్టుకున్న పత్రి ఒక్కరి కల దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే. గల్లీలో క్రికెట్ ఆడే వారి దగ్గరనుంచి, ఖరీదైన అకాడమీల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకునే వారందరి లక్ష్యం టీమిండియాలో చోటు దక్కించుకోవాలనే. కానీ గల్లీ క్రికెటర్లు తమ కల నెరవేర్చుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే క్రికెట్ ఖరీదైన క్రీడ. ఎంత టాలెంట్ ఉన్నా…అందులో ఎదగడానికి చాలా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఒకప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి పెద్ద పెద్ద నగరాల నుంచి మాత్రమే క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకునేవారు. తర్వాత తర్వాత దేశంలో క్రికెట్ కు బాగా ఆదరణ పెరగడంతో చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చిన క్రికెటర్లకు కూడా జట్టులో చోటు దక్కింది. సాధారణంగా ఎవరికయినా..ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ ప్రతిభను నిరంతరం సానబెట్టుకుంటూ ఉండాలి. అలా చేయడానికి డబ్బు కావాలి. అది అందుబాటులో లేకే ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభ గల్లీ స్థాయిలోనే ఆగిపోతుంది. ఇప్పటిదాకా భారత జట్టుకు ఆడిన వాళ్లంతా.. అకాడమీల్లో మెరుగైన శిక్షణ తీసుకున్నవారే. చిన్నతనంలో గల్లీలో క్రికెట్ ఆడినప్పటికీ..
యుక్తవయస్సు వచ్చేసరికి ఏదో ఒక చోట శిక్షణ తీసుకుని…ప్రతిభకు సానపెట్టుకుని జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కానీ అలా డబ్బులు ఖర్చుపెట్టే స్థోమత అందరికీ ఉండదు. బహుశా భారత క్రికెట్ కు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కన్నా మెరుగైన క్రికెటర్లు దేశంలో చాలామందే ఉండి ఉండొచ్చు. కానీ వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వచ్చి ఉండవు. అందుకే చాలా మంది జూనియర్ క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడాలన్న తమ కలను నెరవేర్చుకోలేని క్రమంలో ఇతర రంగాల్లో స్థిరపడతారు. కానీ హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రయాణం ఇందుకు భిన్నం. గల్లీ స్థాయిలో క్రికెట్ ఆడుతూ కేవలం రెండేళ్ల వ్యవధిలో జాతీయ జట్టుకు ఎంపికయిన ఆటగాడిగా ఘనత సాధించాడు మహ్మద్ సిరాజ్ . 2015 వరకు అతను ప్రాక్టీస్ చేసింది హైదరాబాద్ ఇరుకు గల్లీల్లోనే. మాసబ్ ట్యాంక్ దర్గా ప్రాంతానికి చెందిన సిరాజ్ పేదకుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఆటోడ్రైవర్. ఓ చిన్న అద్దె ఇంట్లో నివసించేవారు. రోజూ పనిచేయకపోతే కుటుంబం గడవని పరిస్థితి. ఇక వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి క్రికెట్ శిక్షణ పొందడమనేది కలలోకూడా ఊహించని విషయం. అందరి మధ్యతరగతి, పేద కుటుంబాల లానే ఆటలు కూడుపెట్టవు అనేదే సిరాజ్ ఇంట్లో పరిస్థితి కూడా..బంతిపట్టుకుని ఎప్పుడూ ఆడుతూ తిరిగే సిరాజ్ ను చూసి తల్లి ఆందోళన పడేది. కానీ సిరాజ్ అదే బంతితో ఆ కుటుంబం ఆర్థిక స్థితిని మార్చివేశాడు.
2010 నుంచి హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న సిరాజ్ తన అసాధారణ ప్రతిభతో రెస్టాఫ్ ఇండియా, ఇండియా ఏ జట్లుకు సెలక్టయ్యాడు. దేశవాళీ టోర్నమెంట్లలో అతను చూపిన ప్రతిభ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడింది. దీంతో సిరాజ్ జాతకం మారిపోయింది. ఐపీఎల్ పదో వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సిరాజ్ ను 2.6కోట్లకు సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ నమ్మకాన్ని సిరాజ్ నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి స్టార్ క్రికెటర్ గా మారి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు ఎంపికయిన సిరాజ్..రెండో టీ20లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్ర చేశాడు. గల్లీ స్థాయిలో క్రికెట్ ఆడే తనకు అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడే అవకాశం లభించడంతో మైదానంలో అడుగుపెట్టేముందు సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనై చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. సిరాజ్ ఒక్కడికే కాదు…అతని నేపథ్యం తెలిసినవాళ్లకు కూడా ఈ సంద్భంగా భావోద్వేగం కలిగింది. పేద కుటుంబం నుంచి వచ్చి..జాతీయ జట్టుకు ఎంపికయిన సిరాజ్ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.