Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పడంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు తర్వాతే ఎవరైనా… ఎవరేమన్నా అనుకుంటారు… తర్వాత ఏమన్నా చిక్కులొస్తాయి… తన మాటల వల్ల ఇతరులతో అభిప్రాయభేదాలొస్తాయి వంటి భయాలు, ఆలోచనలూ ఏవీ ఆయనకుండవు. మనసులో అనుకున్నది సూటిగా చెప్పేయడమే ఆయన నైజం. తాజాగా… ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2018… రెండో రోజు కార్యక్రమంలో కూడా మోహన్ బాబు ఇలాంటి వైఖరే ప్రదర్శించారు. కుమార్తె మంచులక్ష్మితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు సినిమాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. దేశంలో 95శాతం రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నాయకులు అనేక వాగ్ధానాలు చేస్తారని, కానీ వాటిని నిలబెట్టుకోవడం లేదని, నిజంగా వాళ్లు తమ ప్రమాణాలు నిలుపుకుని ఉంటే భారతదేశం ఇంకా బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే తన స్నేహితుడు, అన్నయ్య నందమూరి తారక రామారావు మాత్రం నిజాయితీ పరుడని, ఆయనకు లంచం అంటే ఏమిటో కూడా తెలియదని అన్నారు. ఎన్టీఆర్ తనను రాజ్యసభకు పంపించారని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా తిరిగివచ్చానని చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అభిప్రాయపడ్డారు. అనంతరం ఆయన తన సినిమా కెరీర్ ఆరంభం, కమల్, రజనీలతో తన అనుబంధం గురించి పంచుకున్నారు. టీచర్ అయిన తన తండ్రి తనను కూడా టీచర్ చేయాలని భావించి పదోతరగతి వరకూ చదివించారని, అదే సమయంలో పొలం పనులు కూడా నేర్పారని తెలిపారు. పై చదువుల కోసం చెన్నై వెళ్లి చదువుకుంటూనే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించానని చెప్పారు. రోజూ సినిమా సెట్స్ లో దర్శకులను కలవడానికి వెళ్తే తనను చాలాసార్లు బయటికి పంపించేవారని గుర్తుచేసుకున్నారు.
1975లో తన జీవితం మారిపోయిందని, వివాహం జరిగిన తరువాత తొలిచిత్రంలో నటించానని, అది సూపర్ హిట్టయ్యిందని తెలిపారు. ఆ తర్వాత విలన్ గా, హీరోగా, కమెడియన్ గా నటించానని, అప్పట్లో సినీ పరిశ్రమలో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కాబట్టి రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవాడినని… ఆనాటి కష్టాన్ని వివరించారు. రజనీకాంత్, కమల్ హాసన్ తనతో కలిసి పనిచేశారని, రజనీ తనకు 40 ఏళ్లుగా పరిచయమని, మంచి మిత్రుడని, అలాగే కమల్ తోనూ తనకు మంచి అనుబంధముందని అన్నారు. తన తండ్రిని కింగ్ మేకర్ గా అభివర్ణించారు మంచులక్ష్మి. రాజకీయాల్లోకి వెళ్లిన నటులు తరపున ప్రచారం చేస్తారని, వారిని గెలిపించేందుకు ప్రయత్నిస్తారని, ఇక్కడున్న వారు ఎవరూ ఆయనకు తెలియదని, అయినప్పటికీ తన అభిప్రాయాలు పంచుకోడానికి భయపడరన్నారు.