మోహన్ బాబు మొదట తెలుగు దేశం పార్టీ లో ఉండేవారు. ఎన్టీఆర్ మీద ఎంతో అభిమానం చూపేవారు. అయితే చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన ప్పుడు, చంద్రబాబు వెంట నడిచారు. చంద్రబాబు మోహన్ బాబు ని రాజ్యసభకు కూడా పంపారు. అయితే రెండవ సారి మోహన్ బాబు ని రాజ్యసభకు పంపక పోవడంతో ఆయన చంద్రబాబు కి ఎదురు తిరిగి పార్టీని వీడారు. అడపాదడపా తన సినిమాల్లో చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. తర్వాతి కాలంలో వైయస్సార్ కి దగ్గరయ్యారు. 2019 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందు బాహాటంగా వైఎస్ జగన్ ని సమర్థించారు. తన కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని ధర్నా కూడా చేశారు.
అయితే గత కొద్దేళ్లుగా తాను నమ్ముకున్న వైఎస్ఆర్సిపి నుండి ఎటువంటి ప్రయోజనము కలగక పోవడంతో ఆ మధ్య మోహన్ బాబు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసారు. అయితే బిజెపి నుండి కూడా మోహన్ బాబు కి రాజకీయ భవిష్యత్తు విషయంలో ఎటువంటి భరోసా లభించలేదని, సానుకూల స్పందన రాలేదని సమాచారం. మొత్తానికి అటు రాజ్యసభ ఆశల మీద జగన్ నీళ్లు చల్లడం , ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పూర్తిగా రాకపోయినా గతంలోలాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే పరిస్థితి లేకపోవడం, ఇటు బిజెపి వైపు నుండి కూడా సానుకూల స్పందన రాకపోవడంతో ప్రస్తుతం మోహన్ బాబు రాజకీయ పరంగా ఒక నిర్వేదంలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది వేచి చూడాలి.