మోహన్‌ బాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మోహన్‌ బాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

టాలీవుడ్‌ చెందిన ఓ ఇద్దరు హీరోలకు డైలాగ్‌ కింగ్‌, విలక్షణ నటుడు మోహన్‌ బాబు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కావాలనే ఆ ఇద్దరు హీరోలు తనని, తన కుటుంబంపై ట్రోల్స్‌ చేయిస్తున్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన చిత్రం సన్నాఫ్‌ ఇండియా. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంతో మంచు విష్ణు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మా’ ఎలక్షన్స్‌ సమయంలో, పలు సందర్భాల్లో మంచు విష్ణు, మోహన్‌ బాబు మాట్లాడిన మాటలు బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో వారి మాటలపై మీమ్స్‌ క్రియేట్‌ చేయడం, వీడియోలతో ట్రోల్‌ చేయడంతో అవి వీపరీతంగా వైరల్‌ అయ్యాయి. తాజాగా మోహన్‌ బాబు ఈ ట్రోల్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి. కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌దు. సాధార‌ణంగా నేను ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను ప‌ట్టించుకోను. ఎవ‌రైనా నాకు పంపిన‌ప్పుడే చూస్తాను.

అయినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఇవి హ‌ద్దులు మీరుతున్నాయి. ఇలాంటి వాటిని చూసిన‌ప్పుడు బాధ‌గా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో నాకు తెలియ‌దు.. కానీ వ్య‌గ్యంగా ట్రోల్ చేయ‌డం అనేది బాధాక‌రంగా ఉంటుంది” అని అన్నారు. అంతేగాక తనపై ఇద్దరు హీరోలు ట్రోలింగ్‌ చేస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స​ చేశారు. ‘నా మీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇద్ద‌రు హీరోలు యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియ‌మించుకుని నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవ‌రో కూడా తెలుసు. వారిని ప్రకృతి గ‌మ‌నిస్తోంది. ఇప్పుడు వారికి బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభ‌విస్తారు. అప్పుడు వారి వెనుక ఎవ‌రూ ఉండ‌రు’ అంటూ హెచ్చరించారు.