టీటీడీ చైర్మన్ గా మోహన్ బాబు ?

Mohanbabu as TTD Chairman
ఎన్నికల కోడ్ ముగియడంతో నిన్న టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. అయితే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఈ సమావేశం నాటకీయ పరిణామాల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ముందుగా నిర్ణయించిన ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ తమంతట తాము రాజీనామా చేయనని చైర్మన్ పేర్కొన్న నేపధ్యంలో జగన్ ప్రభుత్వం ఈ పాలకవర్గాన్ని రద్దు చేయనున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ కోసం పలువురు నేతలు ఇప్పటికే అధిష్టానం ముందు తమ ఆసక్తి కనబరస్తున్నారు. ఇందులో రాజంపేట ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు రేసులో ముందుగా వినిపించింది, అలాగే మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. అయితే ఇదే పదవి కోసం మరింత మంది నేతలు సైతం పట్టుబట్టే అవకాశం ఉంది. జగన్ కుటుంబానికి బంధువు అయిన సినీనటుడు మోహన్ బాబు సైతం టీటీడీ చైర్మన్ పదవి పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు మోహన్ బాబు స్వయంగా వైసీపీలో చేరడమే కాకుండా, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే ఆయన కుమారుడు మంచు విష్ణు సైతం వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. దీంతో పాటు మోహన్ బాబు స్వయంగా తిరుపతి వాస్తవ్యుడు కావడంతో పాటు, ఆయనకు అక్కడ పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఇక మరోపక్క ఆయన హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానం విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలోనే ఉండగా శారదాపీఠం స్వరూపానానంద జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా జగన్ గెలుపుకోసం స్వామీజీ పలు యాగాలు సైతం చేశారు. అందుకే ఈ కోణంలో కూడా మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్ పదవి వరించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ గెలుపు సందర్బంగా మోహన్ బాబు నిర్వహించిన ప్రెస్ మీట్ లోసైతం జర్నలిస్టులు ఇదే విషయాన్ని లేవనెత్తగా, ఆయన ఈ వార్తలను ఏ మాత్రం తోసిపుచ్చకపోవడం ఈ ప్రచారానికి ఊతం ఇస్తోంది.