మైసూరులోని లేడీస్ హాస్టల్లో 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని లేడీస్ హాస్టల్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో గాయపరిచాడు. బాధితురాలి సహచరులు తిరిగి హాస్టల్‌కి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఓ మత అధ్యయన కేంద్రంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడు ఒకరికొకరు తెలిసిన వారేనని పోలీసులు వెల్లడించారు.
కాగా లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రదీప్ గుంటి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలు, ఆమె స్నేహితులు, హాస్టల్లోని సహచరుల చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు. కాగా మొదట గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే పోలీసులు ఆమెను ప్రశ్నించిన తర్వాత నిందితుడు తెలిసిన వ్యక్తిగా తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆగస్టు 24 న లలితాద్రిపుర ప్రాంతానికి సమీపంలో చాముండి కొండ దిగువన మైసూరు శివార్లలో మరో గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.