ఓ బాలుడు..ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. కర్నూలు జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం ఎస్ఐ తిమ్మారెడ్డి అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు వ్యవసాయ, ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2న గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీ పని చేసేందుకు వెళ్లారు.
ఈ దంపతుల ఆరేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఇంటి పక్కనే పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు.. బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి బాత్రూంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన బాలిక.. వారం రోజుల క్రితం జరిగిన ఘటనను గురువారం తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సంజామల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాలుడిపై ఫోక్సో చట్టం, సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.