ఆడవాళ్లపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. ఒంటరిగా ఉన్న యువతులనే టార్గెట్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల కిందట కృష్ణా జిల్లాలో ఆటోలో ఒంటరిగా వస్తున్న యువతిపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దాడి చేసి పరారైన సంఘటన మరువక ముందే తాజాగా గుంటూరు జిల్లాలో ఆటోలో ఒంటరిగా వెళ్తున్న విద్యార్థినిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడో నీచుడు.
గుంటూరు జిల్లా పీవీపాలెం మండలంలో యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఖాజీపాలెం నుంచి అల్లూరు వెళ్లేందుకు విద్యార్థిని ఆటో ఎక్కింది. మార్గమధ్యంలో ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగిపోవడంతో.. ఆటోలో విద్యార్థిని ఒక్కటే కూర్చొని ఉంది. ఒంటరిగా ఉన్న ఆమెతో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించి.. ఆటోను వేరే దారిలోకి మళ్లించాడు.
ఆటోను డ్రైవర్ దారి మళ్లించడంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన విద్యార్థిని.. ఏం జరుగుతుందోనని భయపడి ఆటోలో నుంచి కిందకి దూకేసి తప్పించుకుంది. ఆటోలో నుంచి ఒక్కసారిగా దూకడంతో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ పరారీలో ఉండటంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.