ఖైదీల ఉపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్ అన్నారు. పట్టణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయగా, శుక్రవారం డీఐజీ, జిల్లా జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డీఎస్పీ నర్సింహులుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 22 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో ప్రారంభించామని, త్వరలోనే కల్వకుర్తిలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నాని, అందులో 250 మంది విడుదల ఖైదీలు ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రతి నెల ఒక్కొక్కరికి రూ.12వేల వేతనం చెల్లిస్తున్నామన్నారు.
పెట్రోల్ బంకుల ద్వారా లాభాలు లేకున్నా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామన్నారు. అచ్చంపేట పెట్రోల్ బంకులో 13 మంది విడుదల ఖైదీలు పని చేస్తారన్నారు. జైలు నుంచి విడుదలైన వారు నేరాల వైపు వెళ్లకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పెట్రోల్‌బంకు ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఉమామహేశ్వర క్షేత్రంలో డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఐజీ వెంట సీఐ రామకృష్ణ, జైళ్ల శాఖ సీఐ తిర్మల్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.