కశ్మీర్ లో రంజాన్ సందర్భంగా ఇంటికి వెళుతున్న ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు ఇటీవల కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని ఔరంగజేబ్ గ్రామానికి చెందినా యువకులు గ్రామస్తులు ప్రతీకారం తీర్చుకునేందుకు స్వస్థలానికి చేరుకున్నారని ఒక జాతీయ మీడియా కధనాన్ని ప్రసారం చేసింది. కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని మెంధర్ మండలం సలాని గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను జూన్ లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు.
ఉద్యోగాల సౌదీ అరేబియాలో ఉంటున్న ఆ గ్రామ యువకులు ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో రగిలిన సుమారు 50 మంది యువకులు తమ సోదర సమానుడైన ఊరివాడిని చంపినవాళ్లను మట్టుబెట్టేందుకు ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ విషయమై మొహమ్మద్ కిరామత్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు చంపారని తెలియగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి, వెంటనే స్వస్థలానికి బయలుదేరా. నాలాగే దాదాపు 50 మంది యువకులు భారీ జీతభత్యాలను వదులుకుని సలానీకి తిరిగివచ్చారు. మా అందరి లక్ష్యం ఔరంగజేబ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే’ అని ఆయన చెప్పుకొచ్చాడు.. ఉగ్రవాదుల్ని వేటాడేందుకు తామంతా ఆర్మీ, పోలీస్ విభాగంలో చేరుతామని ప్రకటించాడు.
ఇక మరోపక్క భారత్-పాక్‌లను ఆనుకుని ఉన్న సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తాన్ భూభాగంలో సుమారు 600 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత నిఘావర్గాల నివేదిక బట్ట బయలు చేసింది. భారత నిఘా వర్గాల నుంచి ఒక జాతీయ్ చానల్ కి చిక్కిన సమాచారం ప్రకారం నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు అందించిన ఈ నివేదికలో సుమారు 600 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండగా పాకిస్తాన్ భద్రతా బలగాలు, పాక్ ఆర్మీ సైన్యం అందుకు వారికి సహకరిస్తున్నాయని పేర్కొని ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌కి చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ఈ ఉగ్రవాదులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా నిఘావర్గాల నివేదిక సందేహం వ్యక్తంచేసింది.