లాలూకు మ‌రిన్నిచిక్కులు

More trouble for former Bihar Chief Minister Lalu Prasad Yadav

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు మ‌రిన్ని చిక్కులు ఎదుర‌వుతున్నాయి. లాలూకు, ఆయ‌న కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ కు సీబీఐ స‌మ‌న్లు జారీచేసింది. రైల్వేశాఖ టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లపై సీబీఐ లాలూకు నోటీసులిచ్చింది. ఈ నెల 11న లాలూ, త‌ర్వాతిరోజు ఆయ‌న కుమారుడు సీబీఐ అధికారుల ఎదుట హాజ‌రుకావాల్సిఉంది. 2006లో రైల్వేశాఖ మంత్రిగా ప‌నిచేసిన లాలూ కొన్ని టెండ‌ర్లు అక్ర‌మంగా కేటాయించిన‌ట్టు సీబీఐ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. 

పూరీ, రాంచీలోని రైల్వే స్టేష‌న్ల‌లో హోట‌ళ్లు న‌డుపుకునేందుకు లాలూ హ‌యాంలో టెండ‌ర్లు కేటాయించారు. ఈ టెండ‌ర్ల‌ను లాలూ ప్ర‌యివేట్ వ్య‌క్తుల‌కు అక్ర‌మంగా కేటాయించార‌ని గ‌తంలో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనికి సంబంధించే సీబీఐ స‌మ‌న్లు జారీచేసింది. ఈ ఆరోప‌ణల నేప‌థ్యంలో జులై 7న లాలూ ఇళ్ల‌లో సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. లాలూ కుటుంబానికి చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించి కీల‌క పత్రాలుస్వాధీనం చేసుకుంది. సీబీఐ సోదాలు త‌ర్వాతే బీహార్ లో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. మ‌హాకూట‌మికి ముగింపు ప‌లికిన ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో లాలూ బీజేపీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటం మొద‌లుపెట్టారు. కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఎస్పీ వంటి పార్టీల‌తో క‌లిసి బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని లాలూ భావిస్తున్నారు. పాట్నాలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించి ఇందుకు నాందిప‌లికారు. ఇది జ‌రిగిన కొన్నిరోజుల‌కే లాలూకు సీబీఐ స‌మన్లు జారీచేయ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌మ రాజ‌కీయ‌ప్ర‌త్య‌ర్థుల‌ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ, అమిత్ షాలు సీబీఐ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

తెలుగుదేశం కంచుకోటలు ఎన్నో తెలుసా?

రెండు సీట్లపై కన్నేసిన పరిటాల ఫ్యామిలీ